calender_icon.png 24 January, 2026 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్ విస్తృత పర్యటన

24-01-2026 12:00:00 AM

ఎల్లారెడ్డి, జనవరి 23 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్  విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా 12వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

వార్డులో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. బస్ స్టాండ్ అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని స్పష్టం చేశారు. అదేవిధంగా, సేవాలాల్ జగదంబ మాత ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఎల్లారెడ్డి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని, ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు