calender_icon.png 24 January, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

24-01-2026 12:00:00 AM

  1. చింతిర్యాల ఇసుక ర్యాంపు వద్ద భారీ ట్రెంచ్.

అనుమతుల్లేని ఇసుక రవాణా చేస్తే వాహనాలు సీజ్  కేసులు తప్పవు

ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టం అమలు : అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి

అశ్వాపురం, జనవరి 23 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో శుక్రవారం ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. చింతిర్యాల ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునే దిశగా అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరిగే అవకాశాలను పూర్తిగా నిలువరించేందుకు చింతిర్యాల ఇసుక ర్యాంపులోకి ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ప్రవేశించకుండా భారీగా ట్రెంచ్ తవ్వకాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ముందస్తు చర్యలుగా ట్రెంచ్ తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు.

అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్

ఈ సందర్భంగా సీఐ జి. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, అక్రమ మార్గాల ద్వారా ఇసుక తరలించినా ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాహనాలను వెంటనే సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రెంచ్ను అక్రమంగా పూడ్చి మళ్లీ ఇసుక రవాణాకు ప్రయత్నించిన వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలను అతిక్రమించిన వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని సీఐ స్పష్టం చేశారు.

నిరంతర నిఘా.. పోలీసుల పహారా..

చింతిర్యాల ఇసుక ర్యాంపు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ కదలికలు జరగకుండా పోలీస్ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోందని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రజల సహకారం కీలకం

ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు పొంది చట్టబద్ధంగా ఇసుక రవాణా చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అక్రమాలకు పాల్పడే వారిపైనే చర్యలు ఉంటాయని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

చర్యలు కొనసాగుతాయి.

అశ్వాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించే వరకు ఈ కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా చట్టబద్ధంగానే వ్యవహరిస్తామని అశ్వాపురం సీఐ జి. అశోక్‌రెడ్డి తేల్చిచెప్పారు.