24-01-2026 12:00:00 AM
నిజామాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ నిజామాబాద్‌లో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల రిజర్వేషన్ల కేటాయింపులో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభు త్వం అనుసరించిన ‘ద్వంద్వ నీతి’ ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. సగం సీట్లకు ఒక పద్ధతి, మిగతా సగం సీట్లకు మరో పద్ధతిని అవలంబించడం వెనుక నిజామాబాద్ జిల్లా అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లాటరీ లేని రిజర్వేషన్లు.. అధికారుల అంతరార్థమేమిటి?
నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్‌లు అమలు చేస్తూ 30 సీట్లను మహిళలకు కేటాయించారు. పొజిషన్లోని 30 స్థానాలను డ్రా (లాటరీ) పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేసిన అధికారులు, మిగిలిన 30 స్థానాల విషయంలో మాత్రం గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగతా 50 శాతం సీట్లను ఎటువంటి డ్రా తీయకుండానే, ముందే సిద్ధం చేసుకున్న జాబితాను ఏకపక్షంగా ప్రకటించడం అధికారుల తప్పిదంగా స్పష్టంగా ఆగుపడు తోంది. ఒకే ఎన్నికకు రెండు వేర్వేరు పద్ధతులు అవలంబించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఎస్సీ జనాభా లేనిచోట రిజర్వేషన్లా?
కొత్తగా సవరించిన పంచాయతీ రాజ్ చట్టం-2025 ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏ డివిజన్లో ఎంత మంది బీసీలు, ఎస్సీలు ఉన్నారో ఖచ్చితమైన గణాంకాలు జిల్లా అధికారుల వద్ద లేవు. అయినప్పటికీ, ఎస్సీ జనాభా అసలే లేని లేదా అతి తక్కువగా ఉన్న డివిజన్లలో ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. కాంగ్రెసేతర పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న చోట వారిని దెబ్బకొట్టడానికే ఈ మా ర్పులు చేశారన్నా విమర్శలు వస్తున్నాయి.
హైకోర్టు మెట్లెక్కిన బాధితులు
రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పోతన్కర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా 39, 40, 44 డివిజన్ల రిజర్వేషన్లను ఆయన సవాలు చేశారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ డివిజన్లను ఎస్సీలకు కేటాయించారో సమాధానం చెప్పాలని జిల్లా యంత్రాం గాన్ని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ల వివరాలు, గణాంకాలు అడిగితే ఇవ్వకుండా అధికారులు ముఖం చాటేయడం గమనార్హం.
ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్:
రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేశారన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ఈ అవకతవకలపై విచారణ జరిపి, పారదర్శకంగా రిజర్వే షన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రిజర్వేషన్ల కల్పనలో శాస్త్రీయత లేదు, పద్ధతి లేదు..
కేవలం అధికార పార్టీ ప్రయోజనం కోస మే అధికారులు పనిచేస్తున్నాట్టు ఆరోపణలు ఉన్నాయి ఆధారాలు చూపమంటే జిల్లా యంత్రాంగం వద్ద సమాధానం లేదు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య విరుద్ధం.‘ అందుకే హైకోర్టుకు వెళ్ళాను. రిజర్వేషన్స్ విషయంలో సమాధానం ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
- పోతన్కర్ లక్ష్మీనారాయణ, పిటిషనర్