calender_icon.png 22 May, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి

22-05-2025 12:00:00 AM

ఇబ్రహీంపట్నం, మే 21:  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరి పత్రాలను లబ్ధిదారులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామాలు, మున్సిపాలిటీలోని 24 వార్డులలోని 872 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు 20 వేల ఇండ్లు అందిస్తామని అన్నారు. లబ్ధిదారులకు నేటి నుంచే ఇండ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అన్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు నాలుగు విడుతల వారీగా తమ బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరుగుతుందని అన్నారు.

అలాగే లబ్ధిదారులు నిర్మించే భూమి 66 గజాల లోపు నిర్మించాలని తెలిపారు. లబ్ధిదారుల ఇండ్లు నిర్మాణం చేపట్టిన క్రమంలో సగభాగం నిర్మించి తర్వాత మధ్యలో పూర్తిగా వదిలేస్తే వారు పది సంవత్సరాల వరకు అనర్హులుగా ఉంటారని, ఎవరైనా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టకపోతే వారి ప్లేస్ లో వేరే అర్హులకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం మూడు నెలలలో పూర్తి చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణం పూర్తిగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆధ్వర్యంలో, అధికారుల పర్యవేక్షణ లో జరుగుతుంది. ఇందులో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే తమకు నేరుగా కాల్ చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డివో అనంతరెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి నాయక్, మున్సిపాలిటీ కమీషనర్ రవీంద్ర సాగర్, ఇంచార్జ్ ఎంపీడీఓ జంగయ్య, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసి శేఖర్ గౌడ్ (మామ), రాష్ట్ర సేవాదళ్ ఉపాధ్యక్షుడు మంకాల దాసు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్, మండల అధ్యక్షులు జడలా రవీందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.