calender_icon.png 15 November, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేపై సీపీ ఫోకస్

15-11-2025 09:03:36 PM

- వంటిమామిడి - దుద్దెడ రోడ్డు పరిశీలన 

- మరమ్మతులు చేయాలని సూచనలు 

- ఫ్లెక్సీల తొలగింపుపై దృష్టి

సిద్దిపేట క్రైం: రాజీవ్ రహదారిపై ప్రమాదాలను తగ్గించేందుకు సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎస్‌ఎం విజయ్‌కుమార్ సమాయత్తమయ్యారు. సిద్దిపేటలో బాధ్యతలు చేపట్టారు తొలిసారిగా శనివారం ఆయన రోడ్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా ప్రారంభమయ్యే వంటిమామిడి నుంచి దుద్దెడ వరకు రహదారిని విశ్లేషణాత్మకంగా పరిశీలించారు. ప్రమాదకర ప్రదేశాల్లో పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట హెచ్ కేఆర్ ఇన్‌ఫ్రా డీజీఎం విజయ్ భాస్కర్ రెడ్డి, సైట్ ఇంజనీర్లు శ్రీనివాస్, కిషోర్, హైదరాబాదు ఆర్అండ్బీ కన్సల్టెంట్ పీవీ రావు ఉన్నారు. రహదారిపై పగుళ్లు, గుంతలు, ఎడ్జ్‌ల వద్ద దెబ్బతిన్న లొకేషన్లు, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. వాహనదారులకు ఆటంకం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని,  రాత్రివేళల్లో  అవి ప్రమాదాలకు కారణమవుతున్నాయని  సూచించారు.

అవసరమైన చోట్ల బస్‌బేలు ఏర్పాటు చేయటం, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, ప్రమాద సూచనలను ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఇంజనీర్లు తక్షణం చేపట్టాలని ఆదేశించారు.  త్వరలో జరగనున్న కొమురవెల్లి జాతరకు భారీగా భక్తుల రద్దీ పెరుగుతుందని భావిస్తున్నందున, రోడ్డు మరమ్మతులు అవసరమైన భాగాల్లో క్లియరెన్స్ వంటి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రోడ్డుపై, డివైడర్లపై, విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన అనధికారిక ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవి డ్రైవర్ల దృష్టిని మరల్చి ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. పోలీసు అధికారులు హైవే అథారిటీతో సమన్వయం చేసుకుని ఫ్లెక్సీలను తొలగించనున్నారు. ఆడిట్ సమయంలో స్థానికులు తమ సమస్యలను వివరించగా, వాటిని ఓపికగా విని త్వరితగతిన పరిష్కరిస్తామని సిపి విజయకుమార్ భరోసా ఇచ్చారు. గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు, సిబ్బంది, HKR ఇంజనీర్లు శ్రీనివాస్, కిషోర్ సీపీ వెంట ఉన్నారు.