calender_icon.png 15 November, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్ట అవగాహనే నేర రహిత సమాజానికి పునాది

15-11-2025 08:57:03 PM

నకిరేకల్ సీనియర్ సివిల్ జడ్జి సూర్యవర్ మంజుల

కట్టంగూర్,(విజయక్రాంతి): ​పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంచడం ద్వారా భవిష్యత్తులో సమాజంలో నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని నకిరేకల్ సీనియర్ సివిల్ జడ్జి సూర్యవర్ మంజుల అన్నారు.​శనివారం మండల పరిధిలోని ముత్యాలమ్మగూడెం ఆవాసం చిన్నపురి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో, మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

​సమాజంలో నేరాలు జరగడానికి ప్రజలకు చట్టాలు, శిక్షలు, న్యాయవ్యవస్థపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. క్షణికావేశంలో జరిగే నేరాలు అనేక కుటుంబాలను దెబ్బతీస్తాయనీ, అపరాధులు జైలు పాలవడంతో వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులుపడుతున్నాయని ఆమె చెప్పారు.​న్యాయ సేవా సంస్థ ద్వారా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం నేర రహిత సమాజ నిర్మాణమేనని ఆమె స్పష్టం చేశారు.నేటి బాలలే రేపటి పౌరులు.

వారికి చిన్న వయసులోనే చట్టాలపై అవగాహన కల్పిస్తే మంచి సమాజానికి బలమైన పునాది ఏర్పడుతుంది” ఆమె అన్నారు. విద్యార్థులు చదువులతో పాటు చట్టాలు, న్యాయవ్యవస్థపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ​న్యాయ శాస్త్రం అభ్యసిస్తే సమాజంలోని అన్ని రంగాలపై అవగాహన పెరుగుతుందని, విద్యార్థులు చట్టాలపై తెలుసుకున్న విషయాలను తమ తల్లిదండ్రులు, కుటుంబాలకు కూడా తెలియజేయాలని ఆమె సూచించారు.​ఈ కార్యక్రమంలో కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్, సీనియర్ న్యాయవాదులు ప్రకాష్ రావు, సోమయ్య, వంగూరు వెంకన్న, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఏఎస్ఐ నాయని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.