15-11-2025 08:54:31 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ KGBV జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై శనివారం విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సహాయక మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు (AMVI) రఫీ, స్నిగ్ధ, మరియు ఉదయ్ విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా AMVI ఉదయ్ మాట్లాడుతూ... “ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టం కలిగించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు” అని అన్నారు. అలాగే తల్లిదండ్రులు హెల్మెట్ ధరిస్తేనే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారని గుర్తుచేశారు.
యువత మాదకద్రవ్యాల ప్రలోభాలకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. తోటి విద్యార్థుల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసలైనట్లు గమనిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. కళాశాల ప్రత్యేక అధికారి మంగమ్మ,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనీ ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత నియమావళిపై కరపత్రాలు పంపిణీ చేశారు.