calender_icon.png 20 December, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటా..

20-12-2025 04:39:38 PM

గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తా..

హుజూరాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యలు

హుజురాబాద్,(విజయక్రాంతి): రాజకీయ బిక్ష పెట్టిన హుజురాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని, ఎమ్మెల్సీ నిధుల్లో నుంచి 80 శాతం వరకు నిధులను కేటాయించి హుజురాబాద్ ప్రాంత గ్రామాల అభివృద్దికి పాటుపడతానని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో శనివారం ఆయన పర్యటించారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హుజురాబాద్ మండల సర్పంచులను పలువురిని ఆయన అభినందించి, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా కార్యాలయం తెరిచి నియోజకవర్గ ప్రజల సమస్యలను  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని, వాటిని ప్రజలు తిప్పి కొట్టి  కాంగ్రెస్ సిద్ధాంతాల వైపే నిలిచారని అన్నారు. పంచాయతీ ఎన్నికలల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేశాయని అన్నారు. రెండు పార్టీలు కలిసి 40 గ్రామపంచాయతీ స్థానాలు గెలిస్తే, కాంగ్రెస్ ఒంటరిగా 31 స్థానాలను గెలిచిందన్నారు.

మరో 15 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని,గెలిచిన అభ్యర్థులు బీజేపీ, బీఆర్ఎస్ అని చూడకుండా సమానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని, పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ.. అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు, ఇంటిగ్రేటెడ్ మాడల్ స్కూళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.

ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధి అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు సొంత లాభం కోసం పనిచేస్తాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజల బాగుకోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ఉండి హుజూరాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన తుగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు.

 జమ్మికుంటలో ఎమ్మెల్సీ బల్మూరికి ఘన స్వాగతం

 హుజురాబాద్ పట్టణంతో పాటు జమ్మికుంట, ఇల్లందకుంటలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచాల పేల్చి స్వాగతం పలికారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ తో ఇల్లందకుంటకు చేరుకున్నారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో  స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, స్వామివారి చిత్రపటం ఎమ్మెల్సీకి అందించి, వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో ఆయన వెంట పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య, తింగిరి జైపాల్ రెడ్డి, హుజురాబాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.