calender_icon.png 7 August, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

06-08-2025 11:44:03 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం సాహసోపేతమైందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Constituency In-charge Dr. Kota Neelima) అన్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ పేరుతో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు గడువులోపు కుల గణన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన ప్రక్రియ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఏ సామాజిక తరగతి జనాభా ఎంత ఉందో వారికి రాజకీయంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో అంతే శాతం అవకాశాలు దక్కాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమని తెలిపారు.

ప్రజలకిచ్చిన మాట మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కుల గణన ప్రక్రియను ప్రధాన మంత్రి మోడీ సైతం అంగీకరించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు, ఉద్యోగ, విద్యా అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్దితో పని చేస్తుందని పేర్కొన్నారు. అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదింపచేసి పార్లమెంట్‌కు పంపించిందన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో అమోదించాలని డిమాండ్‌ చేస్తూ నేడు ఢిల్లీ గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుకూలంగా లేదన్నారు. ముస్లింల ముసుగులో రాష్ట్రంలోని వివిధ బీసీ కులాలకు తీరని అన్యాయం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లింలకు కూడా బీసీ రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లలో ముస్లీంలు కూడా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ మంత్రులు మర్చి పోతున్నారని చెప్పారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ మాత్రమే పాటుపడుతుంది. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను కాంగ్రెస్‌ నెరవేర్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్‌ పార్టీనే తీసుకుందని.. రాహుల్‌ గాంధీ మార్గదర్శకంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని..  కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదం లభించలేదని వాపోయారు. బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్ లో నిర్ణయించి ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అప్పుడు బీసీ రిజర్వేషన్ చట్టం చేయకుండా ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ లబ్ధి కోసమే నిందలు, ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారికి బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేడు జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొనేవారని పేర్కొన్నారు. పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన దాటిపోయిందని.. ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా? కేంద్రంలోని NDA సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోట నీలిమ.