23-07-2025 01:38:02 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఒడిషా నుంచి కూడా నగరంలోని ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు వేలాది బస్సులు రాకపో కలు సాగిస్తాయి. అయితే ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు నగరంలోని అన్ని మార్గాల ద్వారా ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున వస్తున్న క్రమం లో ట్రాఫిక్ జాం సమస్యలు ఏర్పడుతున్నాయి.
సికింద్రాబాద్‌లో జేబీఎస్ తరహాలో బెం గళూరు మార్గంలో బస్ స్టేషన్ లేకపోవడంతో ఈ వైపునుంచి వచ్చే బస్సులన్నీ తప్ప నిసరిగా ఎంజీబీఎస్ రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్‌పై ఒత్తిడి తగ్గించేందుకు, నగరంలో ట్రాఫిక్ నియంత్రిం చేందు కు రాష్ట్ర ప్రభుత్వం ఆరాంఘర్ వద్ద అధునాతన బస్ స్టేషన్ నిర్మించేందుకు సిద్ధమైంది.
రూ. 100 కోట్లతో
10 ఎకరాల్లో సువిశాలమైన బస్‌స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆధునిక వసతులతో నిర్మించేందుకు రూ. 100 కోట్ల విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఈ బస్ స్టేషన్ ఎంతో సౌకర్యంగా మారనుంది. ఇక బెంగళూరు, రాయచూరు, హుబ్లీ, గోవాతో పాటు ఏపీలోని రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే బస్సులు సైతం ఎంజీబీఎస్ రాకుండా ఆరాంఘర్ వద్దే ఆగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కొత్త బస్ స్టేషన్ ఏర్పాటుతో సిటీ ట్రాఫిక్ చాలా మేర తగ్గుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా ఈ బస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ రాజశేఖర్ విజయక్రాంతికి తెలిపారు.