calender_icon.png 23 July, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు నెలలుగా జీతాల్లేవ్!

23-07-2025 12:59:03 AM

  1. ఆర్థిక ఇబ్బందుల్లో మోడల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది
  2. ఫైనాన్స్ శాఖకు బిల్లులు పంపించామంటున్న విద్యాశాఖ అధికారులు
  3. ఆర్థిక శాఖ విడుదల చేస్తేగాని ఖాతాల్లో జమకాని వేతనాలు

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): వారంతా చిరుద్యోగులే. నెలంతా పనిచేస్తే వారికొచ్చే జీతం రూ.15 వేల నుంచి రూ.19,500 వరకే. ఈ కాస్తంతా జీతం కూ డా అందక ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రం లోని మోడల్ స్కూళ్లలో నెలకొంది. గత నాలుగు నెలలుగా వారికి జీతాలు అందడంలేదు. మరో పది రోజులు గడిస్తే జూలై నెల కూడా పూర్తవుంతోంది.

కానీ ఇంతవరకు వారికి జీతాలు అందని పరిస్థితి. నెలంతా ప నిచేస్తే ఇవ్వాల్సిన వేతనాలను సమయానికి అందించకపోవడంతో మోడల్ స్కూళ్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతుండటం తో కుటుంబాలు గడవలేని పరిస్థితి అని ఉ ద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఈవిధంగా నెలల తరబడిగా వేతనా లు విడుదల చేయకపోవడం సరైంది కాదని నిలదీస్తున్నారు. ఒకవైపు చాలీచాలని వేతనాలు, దీనికితోడూ ఆలస్యంగా ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసలే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. పిల్లలకు పుస్త కాలు, యూనిఫామ్ కొనాలన్న తమ వద్ద డబ్బులు ఉండడంలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్చి నుంచి పెండింగే

 రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నా యి. ఒక్కో స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అటెండర్, నైట్ వాచ్‌మెన్ పనిచేస్తున్నారు. వీరందరికీ గత మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల వేతనాలు అందాల్సి ఉంది. ఇవి ఇంతవరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. జూలై నెల గడుస్తోంది. ఇం కో వారం, పది రోజులైతే ఐదు నెలల వేతనాలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది.

ఒకట్రెండు నెలలు వేతనాలు ఆలస్యమైతే సర్దుకోవచ్చు కానీ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియకపోవడం తో ఉద్యోగులు ఇంటి అద్దె, నెలవారి ఖర్చు లు, ఈఎంఐలు, ఇతర చెల్లింపుల విషయం లో ఇబ్బందులు పడుతున్నారు. పెనాల్టీలతో చెల్లింపులు చేస్తున్నట్లు వాపోతున్నారు.

కుటుంబాలు కూడా గడచే పరిస్థితిలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహి తులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి కు టుంబాలను పోషించుకుంటున్నారు. ఇదేదో ఒక నెల, రెండు నెలలు కాదు. ప్రతిసారి ఆలస్యంగానే అందుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. నేడు, రేపు అంటూ ఎప్పుడు వేతనాలు వస్తాయోనని ఎదురుచూడాల్సిన పరిస్థి నెలకొందంటున్నారు. ఇంటి నుంచి స్కూళ్లకు వెళ్లేందుకు కనీసం బైక్ పెట్రోల్‌కు డబ్బులు కూడా ఉండడం లేదని ఓ ఉద్యోగి వాపోయాడు.

బడ్జెట్ లేదంటున్న అధికారులు

జీతాలు అందక చిరుద్యోగులు విలవిల్లాడుతున్నారు. వచ్చేదే అరకొర జీతం. దీనికి నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. జీతాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడంలేదని మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. వీరి వేతనాలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే స్టేట్ ఆఫీస్‌కు చేరాయి.

ఇక్కడి నుంచి అధికారులు సైతం ఆర్థికశాఖకు పంపించారు. పంపించి రోజులు గడుస్తున్నా బిల్లుల విడుదలకు ఇంకా క్లియరెన్స్ రావడంలేదు. బడ్జె ట్ లేదని అధికారులు సమాధానం చెబుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అప్రూ వల్ కాగానే జమ చేస్తామని అంటున్నారు. పైగా వచ్చినప్పుడే తీసుకోవాలని అధికారులు బదులిస్తున్నారు. 

ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలివ్వాలి

తక్షణమే నాలుగు నెలల జీతాలు విడుదల చేయాలి. మా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. నిత్యావసర సరుకులు, రోజూవారి ప్రయాణ ఖర్చులకు డబ్బులు ఉండడంలేదు. గత ఆరు నెలలుగా ఇదేతంతు. సకాలంలో జీతాలు వేయడంలేదు. మొక్కుబడిగా జీతాలు చెల్లిస్తున్నారు. ప్రతినెలా ఒకటో తారీఖున మాకు జీతాలు వేయాలి. జీతాలు ఆలస్యం కావడంతో ఈఎస్‌ఐ, పీఎఫ్ సకాలంలో చెల్లించడంలేదు.

 ఈ.శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్, నవాపేట్, మోడల్ స్కూల్

నెల గడవాలంటే కష్టంగా ఉంది

నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదు. నెల గడవాలంటే మాకు ఎంతో కష్టం గా ఉంది. తొందరగా వేతనాలు ఇవ్వాలి. తీ వ్రమైన ఆర్థిక ఇబ్బం దులను ఎదుర్కొంటున్నాము. పది, పన్నేండేళ్ల నుంచి దీన్నే నమ్ముకొని పనిచేస్తున్నాం. ఏపీ తరహాలో రాష్ట్ర ప్ర భుత్వం మాకూ టైమ్ స్కూల్ అమలు చే యాలి. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలి.

 అంతారం యాదగిరి, పీఈడీ, జిన్‌గుర్తి మోడల్ స్కూల్