23-07-2025 12:38:47 AM
న్యూఢిల్లీ, జూలై 22: భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారింది. 15 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారతసైన్యానికి మంగళవారం మూడు ‘ఏహెచ్- 64ఈ అపాచీ’ హెలికాప్టర్లు అందాయి. ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన సూపర్ పవర్ రోటర్ క్రాఫ్ట్‌లుగా పేరుగాంచాయి. ఈ హెలికాప్టర్ల విడిభాగాలను బోయింగ్‌తో పాటు టాటా గ్రూపు తయారు చేసింది.
బోయింగ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు తొలి విడతలో మూ డు హెలికాప్టర్లు న్యూఢిల్లీ సమీపంలో గల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. 2015లో కుదిరిన ఒప్పందం మేరకు 2020లో 22 అపాచీ మోడల్ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ భారత్‌కు డెలివరీ చేసింది. 2020లో అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ భారత పర్యటనకు వచ్చి న సమయంలో మరో ఆరు అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ ఒప్పందం చేసుకుంది.
అందులో భాగంగా మూడు ఇప్పుడు అం దాయి. ఈ హెలికాప్టర్లు అమెరికా నుంచి రవాణా విమానంలో భారత్‌కు చేరుకున్నా యి. ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో మోహరించనున్నారు. 15 నెలల కిందటే ఇండియన్ ఆర్మీ జోధ్‌పూర్‌లో అపాచీ స్వా డ్రన్‌ను స్థాపించింది. వీటి డెలివరీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది.
గగనతలం నుంచే శత్రుమూకలపై నిప్పుల వర్షం కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత ర క్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయింది. వాస్తవానికి 2024లోనే ఈ హెలికాప్టర్లు డె లివరీ కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యం అయింది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఈ తరహా హెలికాప్టర్లు ఉన్నా యి. చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించారు.
అత్యంత భయంకరమైనవి
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హెలికాప్టర్లుగా ‘ఏహెచ్-64ఈ అపాచీ’ హెలికాప్టర్లు గుర్తింపుపొందాయి. ఇవి కేవలం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా డ్రోన్ల నుంచి సమాచారం సేకరించి కమాండర్లకు చేరవేస్తాయి. ఇటువంటి హెలికాప్టర్లు మరిన్ని కొనుగోలు చేయాలని వాయుసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో 30 ఎంఎం ఎం230 చైన్ గన్, 70 ఎంఎం హైడ్రా రాకెట్లు, ఆరు కిలోమీటర్ల దూరం నుంచే సాయుధ వాహనాలు, ట్యాంకులను ధ్వంసం చేయగల ఏజీఎం-114 హ్లుఫైర్ క్షిపణులు ఉన్నాయి. ఇందులో ఉండే ఓ బుల్లి రాడార్ ఒకేసారి 128 లక్ష్యాలను గుర్తిం చి వాటిలో ప్రాధాన్యతను బట్టి 16 లక్ష్యాలపై దాడి చేయగలదు.