23-07-2025 01:39:55 AM
6 లక్షల కొత్త ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న జీహెఎంసీ.. తన ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తి పన్ను పెంచకుండానే ఏటా వచ్చే వసూళ్లను గణనీయంగా పెంచుకునేందుకు చర్యలు చేపట్టిం ది. రూ.3 వేల కోట్ల లక్ష్యంతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వేను ఏడాది క్రితం ప్రారంభించింది.
ఈ సర్వే ద్వారా వేలాది ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం జూలై మాసంలో ఈ సర్వేను ప్రారంభించిన నియోజియో సంస్థ ఇప్పటి వరకు సుమారు 11 లక్షల ఆస్తులపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. జీహెఎంసీకి సిటీలోని సుమారు 19.5 లక్షల ఆస్తుల నుంచి ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది.
వీటిలో దాదాపు రెండున్నర లక్షల ఆస్తులు కమర్షియల్ ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు నియోజియో సంస్థ సుమారు పదకొండు లక్షల ఆస్తులపై సర్వే ముగించగా, వీటిలో రెండున్నర లక్షల వరకున్న కమర్షియల్ ప్రాపర్టీల సర్వేను పూర్తి చేసింది.వచ్చే జనవరి మాసంలోపు ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉంది.
పదకొండు లక్షల ఆస్తులపై చేసిన సర్వేలో భాగంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తులు కలిపి దాదాపు 6 లక్షల ఆస్తులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు పరిధిలో లేనట్టు అధికారులు గుర్తించారు.ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాకుండా ఉన్న ఆస్తుల్లో ఎక్కువ మెయిన్ రోడ్లకు ఇరవైపులా ఉన్న ఆస్తులే. వీటిలో కమర్షియల్ ఆస్తులే ఎక్కువగా ఉన్నట్ల్లు సర్వేలో భాగంగా అధికారులు గుర్తించారు.
ఆ ఆస్తుల నుంచి కనీసం రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో జీహెఎంసీ అధికారులున్నారు. 2025 వచ్చే మార్చి కల్లా సుమారు రూ.2500 కోట్ల ట్యాక్స్ వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న జీహెఎంసీ ఇప్పటి వరకు రూ.1100 కోట్ల ట్యాక్స్ ను వసూలు చేసుకుంది. లక్ష్యానికి మిగిలిన రూ.1400 కోట్లను వసూలు చేసుకునేందుకు వీలుగా అధికారులు సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించేందుకు స్కె సిధ్దం చేస్తున్నట్లు సమాచారం.
ముందుగానే టార్గెట్లు
సాధారణంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ఏటా అక్టోబర్ తర్వాత సిబ్బంది, అధికారులు దృష్టి సారించే వారు. కానీ ఈసారి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ముందుగానే సిటీలోని 300 పై చిలుకు ప్రాపర్టీ ట్యాక్స్ డాకెట్లకు లక్ష్యాలను నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరం వసూలైన ట్యాక్స్ కలెక్షన్‌ను పరిగణలోకి తీసుకుని దానికి 20 శాతాన్ని పెంచి టార్గెట్లు ఇచ్చినట్లు సమాచా రం.
ప్రతి నెల 30 సర్కిళ్లలో రూ. వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్ చేయాలని సూచించారు. జీహెఎంసీ పర్మినెంట్, ఔట్‌సోర్స్ ఉద్యో గులతో పాటు రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అవసరమైన రూ.135 కోట్లలో సింహాభాగం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ నుంచే సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే అధికారులు నెలకు రూ.వంద కోట్ల కలెక్షన్ చేయాల్సిందేనని సూచించినట్టు తెలిసింది.