20-11-2024 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 19: ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధర వరుసగా రెండో రోజూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర మళ్లీ రూ.77,000 స్థాయిని దాటింది. సోమవారం రూ.660 మేర పెరిగిన పుత్తడి మంగళవారం మరో రూ. 760 పెరిగి రూ. రూ.77,070 వద్దకు చేరింది.
వరుస రెండు రోజుల్లో ఇది రూ.1,420 ఎగిసింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇది రూ.78,000 స్థాయిని దాటింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.700 పెరిగి రూ.70,650 వద్ద నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బంగారం ధర భారీగా క్షీణించి తులం ధర రూ.5,000కు పైగా పడిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఉక్రెయిన్ దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు, అమెరికా దన్నుతో ఉక్రెయిన్ తమ దేశంలో దాడులు జరిపితే ప్రపంచ యుద్ధం వస్తుందంటూ రష్యా హెచ్చరిక చేసిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హఠాత్తుగా పెరిగింది. వరుస రెండు రోజుల్లో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 80 డాలర్ల మేర ఎగిసి కడపటి సమాచారం అందేసరికి 2,635 డాలర్ల వద్ద కదులుతున్నది.
రూ.2 వేలు పెరిగిన కేజీ వెండి
బంగారం బాటలోనే వెండి ధర సైతం మంగళవారం పుంజుకుంది. . హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,000 మేర పెరిగి రూ.1,01,000కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31 డాలర్ల వద్దకు పెరిగింది.