calender_icon.png 6 November, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్ల బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య

06-11-2025 12:32:30 AM

-హుస్సేన్‌సాగర్‌లో దూకిన మహిళ

-భర్తతో విభేదాలే కారణం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): భర్తతో ఏర్పడిన విభేదాలు ఆ కాపురంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉన్నత విద్యావంతురాలైన ఓ చార్టెడ్ అకౌంటెంట్, కన్నపేగు బంధాన్ని కాదని రెండేళ్ల పసిబిడ్డతో సహా హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం తల్లి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పాతబస్తీకి చెందిన వ్యాపారి పృథ్విలాల్, చార్టెడ్ అకౌంటెంట్ కీర్తిక అగర్వాల్ (28) దంపతులు.

వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కీర్తిక గత ఏడాది న్నర కాలంగా బహదూర్‌పురలోని తన తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈ నెల 2వ తేదీన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె, తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మి స్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపం లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, లభ్యమై న మృతదేహాన్ని కీర్తికగా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

కుమార్తెతో కలిసే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని బలంగా అనుమానించి, హుస్సేన్‌సాగర్‌లో గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం చిన్నారి బియ్యార మృతదేహం లభ్యమైంది. ఒకేసారి తల్లి, చిన్నారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.