calender_icon.png 5 July, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

04-07-2025 08:43:10 PM

సిఐటియు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ

భద్రాచలం,(విజయక్రాంతి): జులై 9న  జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో అమరవీరుల స్థూపాల వద్ద జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సిఐటియు భద్రాచల పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈనెల తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని అన్నారు.

ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఉద్యోగులు కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని తీసుకువచ్చిందని, బిజెపి దాని మిత్రపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో వీటి అమలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు రైతులు దేశంలో ఉన్న సమస్త రంగాల ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు.

కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఇప్పటికే విస్తృతమైన ప్రచారం జరుగుతోందని, జూలై 9 వ తేదీన పెద్ద ర్యాలీ జరుగుతుందని, ఆ ర్యాలీలో కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఉపాధ్యక్షులు, ఎం బి నర్సారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గడ్డం స్వామి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోరాటాలు ఆందోళన ద్వారానే ఇటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను తిప్పి కొట్టి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని కోరారు.