calender_icon.png 5 July, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వినియోగించుకోవాలి

04-07-2025 08:40:39 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): అన్ని ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగపర్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి వంటశాల, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో సకల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు.

ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. కళాశాల విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఏకాగ్రతతో కష్టపడి చదివలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టిందని, నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.