18-04-2025 10:05:29 PM
హుజురాబాద్: ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లాహుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ప్రమాదాల కేంద్రాలుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం ప్రమాద సూచికలతో పాటు ప్రమాద ప్రాంతాలను గుర్తించే వీలుగా రహదారులపై రేడియమ్ స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ప్రమాద సూచికలను గమనిస్తూ క్షేమంగా ప్రయాణం చేయాలన్నారు.
తుమ్మనపల్లి, కేశవపట్నం గ్రామాలలో పలు రహదారి భద్రతా చర్యలను చేపట్టామని అన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రమాద ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల వద్ద మోటారు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రైవర్లు, సాధారణ ప్రజలకు ప్రమాద సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసామన్నారు. రహదారి భద్రతా బృందం నిరంతరంగా ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, తీసుకున్న చర్యల ప్రభావాన్ని గమనిస్తూ ఉంటుంది. అవసరమైతే మరిన్ని మెరుగుదలదిశగా చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ వెంకట్ గౌడ్ తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.