05-08-2025 11:14:17 PM
వరంగల్,(విజయక్రాంతి): న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ను మంగళవారం వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కు ఆమోదం తెలిపినందుకు వారు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, పెద్ద విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్ల నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఆ భూమిని విమానాశ్రయ విస్తరణ కోసం ఉచితంగా అందజేస్తుందని తెలియజేశారు.
మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధితో వరంగల్ ప్రజలకు మెరుగైన విమాన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, పర్యాటకం, వ్యాపారంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ లో విమానాశ్రయ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్ల తెలిపారు. రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన భూసేకరణ అనంతరం విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.