04-08-2025 12:04:27 AM
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘దేవర’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం నిరుడు విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా ముగింపు సమయంలో ‘దేవర2’కు లీడ్ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. అయితే ‘దేవర2’ ఉండదనే ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి.అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారని వార్తలొచ్చాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ ఇటీవల ఓ సినిమా వేడుకకు హాజరైన ఎన్టీఆర్ ‘దేవర2’ తప్పకుండా చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ నటించిన ‘వార్2’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పుడాయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్‌కల్లా పూర్తి చేసుకోనుంది.
ఈ నేపథ్యంలోనే ‘దేవర2’ను పట్టాలెక్కించే సన్నాహాల్లో ఉన్నారీ నందమూరి హీరో. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ‘దేవర2’ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి ఫైనల్ వెర్షన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారీ డైరెక్టర్.