19-01-2026 12:00:00 AM
మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిన గుర్రాలపాడు నేత బుర్ర మహేష్
రఘనాథపాలెం /ఖమ్మం :జనవరి 18(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.
ప్రభుత్వ ప్రజారంజక పాలన, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కీలక నేతలు హస్తం గూటికి చేరుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆపరేషన్ ఆకర్ష్.. లక్ష్యం ఏదులాపురమే!
రాబోయే ఎన్నికల్లో ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గుర్రాలపాడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కీలక నేత బుర్ర మహేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులు పార్టీలోకి రావడం మున్సిపల్ పోరులో కాంగ్రెస్ విజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం‘ అని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ లబ్ధిని ప్రతి గడపకూ చేరవేసే బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బొల్లం వెంకన్న, కొర్ని సీతారాములు, తీగల శివ, దుంపల నాగరాజు, బొబ్బల రాంబాబు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.