01-07-2025 10:10:06 PM
వాజేడు (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వాజేడు ప్రాథమిక వైద్యశాల వైద్యులు కొమరం మహేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాల ఆవరణంలో డాక్టర్స్ డే(National Doctors Day)ను పురస్కరించుకొని ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు కొమరం మహేందర్, మధుకర్ మాట్లాడుతూ... వారానికి రెండుసార్లు డ్రై డే ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డెంగ్యూ దోమలు కుట్టకుండా, దోమలు పుట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
నీటి నిలువ లేకుండా చూసుకోవడం, మురుగు నీటిలో దోమలు పుట్టకుండా ముందస్తుగా మందు పిచికారి చేయడం వంటివి కచ్చితంగా చేయాలని తెలియజేశారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యశాలకు తీసుకురావాలని, రక్తపోటు క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా ఆశ కార్యకర్తలు గుర్తించి నెలసరి మందులు అందించాలని తెలిపారు. గ్రామాలలో గర్భవతులను గుర్తించి వారికి తగిన సేవలు అందిస్తూ కాన్పుకి వైద్యశాలకు తీసుకురావాలని, సహజ కాన్పు అయ్యేలాగా తగిన జాగ్రత్తలు చెప్పాలని అన్నారు. అనంతరం ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది కలిసి వైద్యులు మహేందర్, మధుకర్ లను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు.