calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో ఇదేం ఆస్పత్రి?

27-09-2025 02:14:39 AM

-నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ జరుగుతుండగా కరెంట్ కట్

- గంట పాటు పనిచేయని జనరేటర్

-నరకయాతన అనుభవించిన రోగులు

-పట్టించుకోని ఆస్పత్రి వర్గాలు

నల్లగొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): నల్లగొండలోని కేంద్ర ప్రభుత్వాస్ప త్రిలో శుక్రవారం డయాలసిస్ జరుగుతుండగా కరెంట్ పోయింది. ఆ తర్వాత జనరేటర్ కూడా గంట పాటు పనిచేయలేదు. దీంతో డయాలసిస్ రోగులు నరకయాతన అనుభవించారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి వర్గాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.

నల్లగొండలోని ప్రభుత్వాస్పత్రికి శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో 20 మంది డయాలసిస్ పేషంట్లు వచ్చారు. డయాలసిస్ ప్రక్రియ మొదలైన పది నుంచి పదిహేను నిమిషాలకే కరెంట్ కట్ అయ్యింది. వెంటనే జనరేటర్ ఆన్ చేయాలి. కానీ జనరేటర్ పనిచేయలేదు. దాదాపు గంట వరకు కరెంట్ కూడా రాలేదు. దీంతో చీకట్లో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 20 మంది డయాలసిస్ పేషంట్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గంట పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఏమాత్రం తేడా వచ్చినా బ్లడ్ క్లాట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి. దీంతో పేషంట్లలో ఎడతెగని ఆందోళన. డయాలసిస్ వార్డులోని సిబ్బందిని ఆరా తీస్తే జనరేటర్ పనిచేయడం లేదని సమాధానమిచ్చారు. సిబ్బంది సైతం ఏం చేయాలని తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆస్పత్రి అధికారులుగానీ, డ్యూటీ డాక్టర్లు గానీ అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. గంట తర్వాత కరెంట్ రావడంతో డయాలసిస్ పేషంట్లు ఊపిరి పీల్చుకున్నారు. 

గతంలోనూ దారుణ ఘటనలు

ఈ ఏడాది జూన్‌లో గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ అయింది. పురిటినొప్పులు వచ్చినప్పుడు పరిశీలించిన డాక్టర్లు కడుపులోనే శిశువు చనిపోయిందని నిర్ధారించారు. మృత శిశువును డాక్టర్లు డెలివరీ చేశారు. తల్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. శిశువు మృతికి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.

2024 ఆగస్టు 24న మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులు భరించలేని ఆ మహిళ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అప్పుడు తామే డెలివరీ చేస్తామంటూ డాక్టర్లు, సిబ్బంది ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. మహిళకు ఆపరేషన్ చేయగా శిశువు (బాబు) అప్పటికే మృతి చెందింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయారంటూ బంధువులు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలానికి చెందిన గర్భిణి అశ్విని తన భర్తతో 2024 ఆగస్టు నెలలో అర్ధరాత్రి అంబులెన్సులో నల్లగొండలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. డెలివరీకి సమయం ఉందని వాకింగ్ చేయమని చెప్పారు. ఆమె వాకింగ్ చేస్తూ అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణులను మా కోసం పిల్లలు కంటున్నావా అంటూ సూటిపోటీ మాటలు అనడం కూడా తెలిసిందే. మంత్రి కోమటిరెడ్టి వెంకట్‌రెడ్డి ఇలాకాలో ఇలా జరగడం గమనార్హం.