27-09-2025 01:09:03 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగల ధమాకా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను ప్రకటించడంతో ఒక్కో కార్మికుడికి రూ.1.95 లక్షలు అందింది. శుక్రవారం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కార్మికుల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని (పీఎల్‌ఆర్) ప్రకటించింది. ఇది కోల్ ఇండియా కార్మికులు, దాని సబ్సిడరీలతో పాటు సింగరేణి కార్మికులకూ వ ర్తించనుంది.
ఈ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం కింద ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్ష లు అందనున్నాయి. కోల్ ఇండియా సంస్థ లో పనిచేస్తున్న 2.09 లక్షల మందికి ఈ ప్రో త్సాహకం అందనుండగా.. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 38 వేల మంది కార్మికు లకూ ఒక్కొక్కరికి లక్షా 3 వేల మొత్తం అందనున్నది.
ఇప్పటికే సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 34 శాతం లాభాల వాటాను ప్రకటించడం.. ఇప్పుడు కోల్ ఇండియా సంస్థ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం ప్రకటించడంతో.. దసరా, దీపావళి పండుగల ధమాకా సంబురాలు కార్మికుల కుటుంబాల్లో కనిపిస్తోంది.
కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు..
కోల్ ఇండియా బొగ్గు కార్మికులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సందర్భంగా బొగ్గు, గనుల శాఖా మంత్రి జీ కిషన్‌రెడ్డి ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబురాలు, దసరా, దీపావళి పండుగను పురస్కరించుకొని కోల్ ఇండియా యాజమాన్యం, తమ సబ్సిడరీలు, సింగరేణి ఉద్యోగులకు పీఎల్‌ఆర్ ప్రకటించిందని పేర్కొన్నారు.
ఒక్కొక్క కార్మికుడికి రూ.1.03 లక్షల చొప్పున బోనస్ ప్రకటించినట్టు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, దీన్ని కోల్ ఇండియా ఆచరణలో పాటిస్తూ.. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. కార్మికులకు, వారి కుటుంబాలకు దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.