calender_icon.png 27 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని ఏరోస్పేస్ రాజధానిగా తీర్చిదిద్దుతాం

27-09-2025 02:13:16 AM

  1. నిపుణుల నుంచి సూచనలు స్వీకరిస్తాం
  2. ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ బలోపేతానికి సమగ్ర చర్యలు 
  3. ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలతో మేధోమధనంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని దేశ ఏరోస్పేస్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, దీనిలో భాగంగానే ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ బలోపేతానికి పారిశ్రామికవేత్తలు, నిపుణుల  నుంచి విలువైన సూచనలు, సలహాలు స్వీకరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఫిక్కీ తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ కమిటీ సహకారంతో శుక్రవారం మంత్రి సచివాలయంలో ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో మేధోమథనం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ బలోపేతానికి 60 ఏళ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయని, ఇప్పుడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 30కి పైగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓఈఎంఎస్‌లు, వెయ్యికి పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయని వెల్లడించారు. డీఆర్డీవో, హాల్, జీఎంఆర్, టాటా, అదానీ ఎల్బిట్, సాఫ్రాన్, బోయింగ్- టీఏఎస్‌ఎల్ జేవీ వంటి దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు.

రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ రూ.28,000 కోట్లకు పైగా ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశ ఏరోస్పేస్ రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది రాష్ట్రప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం అనేకమంది పారిశ్రమికవేత్తలు, నిపుణులను భాగస్వాములను చేస్తున్నదని వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, హెచ్‌సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.