27-09-2025 01:18:56 AM
సీఎం నియంతృత్వ పోకడల వల్లే మెట్రో ఫేజ్-1 నుంచి నిష్క్రమణ
అనాలోచిత నిర్ణయంతో 15 వేల కోట్ల భారం
బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడంలో ఎల్&టీ సహకరించలేదు
ఆ కారణంతోనే సీఎం కక్ష మెట్రో భూములపై సీఎం, ఆయన అనుచరుల కన్ను
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధంతరంగా వైదొలిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభు త్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ర్ట ప్రజలపై ఒక్కరోజే ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకురావడమే రేవంత్‌రెడ్డికి కంటగింపుగా మారిందని, అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ర్టం విడిచి వెళ్లేలా చేశారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2014లో తాము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20- శాతం మాత్రమే పూర్తయ్యాయని, రాష్ర్ట విభజనతో రైడర్‌షిప్ తగ్గుతుందని ఎల్ అండ్ టీ సంస్థ ఆందోళన చెందితే, స్వయంగా కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు.
ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చి పనులను కేసీఆర్ పరుగులు పెట్టించారని, కేవలం మూడేండ్ల లోనే 2017, నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించామని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ మరోసారి అండగా నిలిచి రూ.3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో రూ.900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడినట్టు వెల్లడించారు.
తమ ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్‌లో కోచ్‌లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశామన్నారు. 69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి, దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్న లైన్‌ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కువాక్‌లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
400 కి.మీ.ల మెట్రో విస్తరణకు ప్రణాళిక..
తాము అధికారం నుంచి దిగిపోయే ముందు, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించామని, ఓఆర్‌ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించామని తెలిపారు.
భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దీన్ని డిజైన్ చేశామని, కానీ, రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయంతో ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేశారని మండిపడ్డారు. తమ భూములు ఉన్నాయని, బీఆర్‌ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చి పిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ అండ్ టీపై మొదటి దెబ్బ వేశారని, అప్పటి నుంచే సీఎంకు, ఎల్ అండ్ టీకి మధ్య పంచాయితీ మొదలైందన్నారు.
మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగినప్పుడు, రాష్ర్ట ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకు వచ్చిందని, కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అని బద్నాం చేద్దామనుకున్న రేవంత్‌రెడ్డి ప్రచారానికి ఇది గండికొట్టిందన్నారు. తమ రాజకీయ లబ్ధికి ఎల్ అండ్ టీ సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబట్టారని, అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ మెట్రో వరకు ప్రతి విషయంలో ఆ సంస్థను వెంటాడి, వేధించారని విమర్శించారు.
నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసిన ఎల్ అండ్ టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి, తన అనుచరుడైన ‘బాంబులేటి శ్రీనివాస్‌రెడ్డి’ సంస్థకు పనులు కట్టబెట్టారని విమర్శించారు. మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని బెదిరించారని వెల్లడించారు. ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్నా, ఎల్ అండ్ టీ సంస్థ రాష్ర్టం నుంచి వాకౌట్ చేసిందన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ అని చెప్పుకొనే సీఎం.. పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ర్టం నుంచి ఒక ప్రతిష్ఠాత్మక సంస్థ ఎందుకు తరలిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అప్పు పుట్టడం లేదంటూ అదనపు భారమెందుకు..
ప్రభుత్వ ఆర్థిక చేతగానితనాన్ని ఎండగడుతూ ‘తెల్లారిలేస్తే ఖజానా ఖాళీ, అప్పు పుట్టడం లేదని సీఎం మొత్తుకుంటారు. ఐటీడీఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దిక్కులేదు. ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని రూ.15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి.
మీ అహంకారపూరిత నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారు’ అని నిలదీశారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ర్టం ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ రూ.15 వేల కోట్లు అదనమని పేర్కొన్నారు. ‘ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎల్ అండ్ టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితుల కన్ను పడింది.
ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారు. ఇప్పటికే ఉన్న మాల్స్‌ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలోనే చూస్తారు. ఇది హైదరాబాద్ ప్రజలపై వేసిన పెద్ద భారం. ఈ నిర్ణయంతో ఎల్ అండ్ టీ షేర్ విలువ 3 శాతం పెరిగింది. ఏ ముడుపులు, ఏ కమీషన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో సీఎం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ఏం చేసినా స్కీమ్.. స్కామే..
రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీమ్, ఒక స్కామ్ ఉంటుందని, ఈ నిర్ణయంలోనూ పారదర్శకత లేదని స్పష్టం చేశారు. కనీసం క్యాబినెట్ సబ్ కమిటీ వేయలేదని, క్యాబినెట్‌లో చర్చించకుండా ‘చట్ మంగ్నీ, ఫట్ షాదీ’ అన్నట్టు నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్తామని, తాము సృష్టించిన రూ.20 వేల కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే, మీరు రూ.15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
తనను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ నేతలు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, తాను పదేళ్లు మంత్రిగా చేశాను, లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పానని గుర్తు చేశారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్‌ఎస్‌కే పట్టం కడతారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ గెలుపు తమదేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.