22-07-2025 12:00:00 AM
మిత్రులే అనిల్ హత్యకు స్కెచ్
ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం
సినీ ఫక్కీలో హత్యకు శ్రీకారం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్, జూలై 21(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత మారెల్లి అనిల్ హత్య మిస్టరీ వీడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత ఈ హత్యకు ప్రధాన నిందితుడు కావడం విశేషం. హత్యకు సంబంధించిన ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.
సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఈనెల 14న కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ను వరిగుంతం గ్రామ శివారులో గుర్తు తెలియని దండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సోమన్నగారి రవీందర్రెడ్డి, రంగంపేటకు చెందిన పడేపు నాగరాజు, పడేపు నాగభూషణం, విజయవాడకు చెందిన శాబొద్ధిన్, అతని స్నేహితుడు చిన్న, రంగంపేటకు చెందిన ఎండి.ఫరీద్, టేక్మాల్కు చెందిన తలారి అశోక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సోమన్నగారి రవీందర్రెడ్డికి, పడేపు నాగరాజు, పడేపు నాగభూషణంతో అనిల్కు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విబేధాలు ఉన్నాయని తెలిపారు.
రవీందర్రెడ్డికి చెందిన స్థలాన్ని అనిల్ 25 సంవత్సరాలకు లీజుకు తీసుకొని అందులో పెట్రోల్ బంక్ స్థాపించినట్లు తెలిపారు. అనిల్ కుటుంబం కూడా రవీందర్రెడ్డికి చెందిన భూమిని లీజుకు సాగు చేసేవారు. కానీ మూడు సంవత్సరాల క్రితం అనిల్ భూమిని సాగు చేయడం ఆపేసి, ఇతరులు కూడా సాగు చేయకుండా అడ్డుకోవడంతో వీరి మధ్య విబేధాలు పొడచూపాయి.
దీంతో రవీందర్రెడ్డి తన మిత్రుడైన పడేపు నాగరాజుతో చర్చించారు. నాగరాజుకు సైతం అనిల్తో రాజకీయ విబేధాలు తీవ్ర స్థాయిలో ఉండడం, అలాగే పడేపు నాగభూషణంతో సైతం అనిల్కు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఘర్షణలు జరగడంతో వీరు ముగ్గురు అనిల్ను హత్య చేయాలని నిర్ణయించినట్లు ఎస్పీ తెలిపారు.
సినీ ఫక్కీలో హత్య...
అనిల్ను నిందితులు సినీ ఫక్కీలో హత్య చేశారు. నిందితుడు పడేపు నాగరాజు ఆదేశాలతో మరో నిందితుడు ఫరీద్ తనకు పరిచయం ఉన్న బీహార్కు చెందిన సచిన్కుమార్ అనే వ్యక్తి దగ్గర గతనెల 27న ఒక తుపాకీని సేకరించి హైదరాబాద్కు చేరుకున్నాడు. ఫరీద్ను నాగరాజు మేడ్చల్లోని గ్యారేజ్కు తీసుకెళ్లాడు. గ్యారేజీలో నాగరాజు తుపాకిని, ఆరు రౌండ్ల బుల్లెట్లను భద్రపర్చినట్లు తెలిపారు.
నిందితులు తమ ప్రణాళికను అమలు చేయడానికి తగిన సమయం కోసం వేచివుండగా, ఈనెల 13న నాగరాజు, శాబొద్ధిన్, చిన్న అనే మరో ఇద్దరితో డీసీఎంలో గ్యారేజ్ నుండి బయలుదేరి రెక్కీ చేయడానికి కౌడిపల్లికి వచ్చారు. రాత్రంగా అక్కడే గడిపిన వారు ఈనెల 14న అనిల్ హైదరాబాద్ వెళ్తున్నాడని తెలుసుకొని నిఘా పెట్టారు. మృతుడు అనిల్ తన మిత్రుడు శేఖర్ను తీసుకొని హైదరాబాద్కు వెళ్లాడు.
అయితే పడేపు నాగభూషణం సైతం గుమ్మడిదల నుండి గాంధీభవన్ వరకు మృతుడిని అనుసరించి తిరిగి గుమ్మడిదల వద్ద మారుతి కారులో వేచి ఉన్నాడు. అక్కడి నుండి తన మిత్రుడు అశోక్కు ఫోన్ చేసి కారు తీసుకొని రమ్మని చెప్పి అదే కారులో నిందితులు గుమ్మడిదల వద్ద వేచివున్నారని తెలిపారు. అదేరోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో మృతుడు అనిల్ గుమ్మడిదల చెక్పోస్టు దాడి వెళ్ళగా నిందితులు రెండు కార్లలో అనుసరించారు.
మార్గమధ్యలో మిత్రుడు శేఖర్ను అప్పాజిపల్లిలో దించి వేసి ఒంటరిగా అనిల్ వెళ్ళడం చూసి దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీస్ పెట్రోలింగ్ ఉండడంతో వరిగుంతం శివారులోకి రాగా అనిల్ కారును అడ్డగించి ఆపివేశారు. వెంటనే శాబొద్ధిన్ తన దగ్గర ఉన్న పిస్టోల్ సహాయంతో మృతుడిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనిల్ పారిపోవడానికి ప్రయత్నించినా విఫలం చెందడంతో నియంత్రణ కోల్పోయి కారును సబ్స్టేషన్ గేటుకు ఢీకొట్టాడు.
అనంతరం దుండగులు అనిల్ వద్ద ఉన్న నగదును దోచుకెళ్ళడం వల్ల దోపిడీ దొంగల పనిగా భావిస్తారని నిందితులు భావించనట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును ఛేదించి నేరస్తులను గుర్తించి పథకం ప్రకారం పట్టుకుని అరెస్ట్ చేసిన జిల్లా ప్రత్యేక బృందాలను ఎస్పీ అభినందించారు.
ఈ ఘటనలో ఏడుగురు నిందితులను గుర్తించగా ఐదుగురిని అరెస్టు చేయగా మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుండి మూడు కార్లు, ఒక డీసీఎం, పిస్టోల్, నాలుగు ఖాళీ బుల్లెట్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్‌ఐలుపాల్గొన్నారు.