calender_icon.png 10 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్ర స్థాయిలో పనిచేయాలి

10-10-2025 01:42:04 AM

-హైదరాబాద్‌లో ఎవరుండొద్దు  

-నియోజకవర్గాల్లోనే ఉండాలి 

-జూమ్ సమావేశంలో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచన  

-ఎన్నికలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలి 

-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలపై అంద రూ దృష్టి పెట్టాలని, మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎవరు కూడా హైదరాబాద్‌లో ఉండొద్దని, క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన జూమ్ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై దృష్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో ఇన్‌చార్జి మంత్రులు మాట్లాడాలన్నారు. నామినేషన్ల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే లీగల్ సెల్‌ను కలవాలన్నారు.

కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించాలన్నారు. ఇన్‌చార్జ్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు  చేయాలన్నారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఎవరు రాజకీయ ప్రకటనలు చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు.  బీసీ రిజర్వేషన్లు అనేది దేశ చరిత్రలోనే పెద్ద సామాజిక విప్లవమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు.

ఓటు చోరి విషయంలో ఏఐసీసీ ఇచ్చిన  ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామానికి 100 చొప్పున సంతకాల సేకరణ చేసి పంపించాలన్నారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రత్యేక శ్రద్ద తీసుకుని సంతకాల సేకరణ పూర్తి చేయాలన్నారు.