10-10-2025 01:44:14 AM
-ట్రాఫిక్ సర్వేను దృష్టిలో పెట్టుకోండి
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
-హ్యామ్’తో రోడ్లకు మహర్దశ
-దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణం
-ప్రమాద రహిత రోడ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి
-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : రాష్ర్టంలో దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. గురువారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి హ్యామ్ రోడ్ల నిర్మాణంపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
హ్యామ్ రోడ్ల నిర్మాణ క్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణ క్రమంలో ట్రాఫిక్ సర్వేను గమనంలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... హ్యామ్ విధానంతో రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నదని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లు అద్దంలా చేయనున్నామని పేర్కొన్నారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ప్రమాద రహిత రోడ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. మొదటి ఫేజ్‌లో సింహ భాగం హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందు లో సింగిల్ లేన్, డబుల్ లేన్, 4 లేన్ల వారీగా రోడ్ల బలోపేతం చేయనున్నామని, దీంతోపాటు రోడ్ల వైడనింగ్ చేయనున్నట్టు తెలిపా రు.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. ఇందులో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటి ఫేజ్‌కు ఒకటి, రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ హరిత, ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.