02-05-2025 12:00:00 AM
ప్రస్తుతం చాలా మందికి సామాజిక మాద్యమాల మీద ఉన్న వ్యామోహం వల్ల ఇలాంటి ఒక రోజు వస్తుందని తాను ముందే భయపడ్డానని పేర్కొన్నారు బాలీవుడ్ తార తాప్సీ పన్ను. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా పోస్ట్ పెట్టారు.. “ఇప్పుడు సోషల్‌మీడియాపై అందరికీ ఉన్న వ్యామోహం చూసి ఇలాంటి రోజొకటి వస్తుందని నేను ఎప్పుడో ఊహించాను. అలా ఊహించుకున్నప్పుడు ఒకింత భయంగా కూడా అనిపించింది.
మన జీవితాన్ని మనం ప్రేమించడంపై దృష్టి పెట్టాల్సింది పోయి ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం. మన చుట్టూ ఉన్నవారు, ఆప్తులైనవారు చూపించే నిజమైన ప్రేమ కన్నా ఆన్‌లైన్ ప్రేమకే మొగ్గు చూపుతామన్న భయం నాలో కలిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల తరబడి మనం కష్టపడి సాధించుకున్న డిగ్రీల కన్నా ఈ లైకులు, కామెంట్స్ ఎక్కువ విలువైనవిగా తోస్తాయని, అధిగమిస్తాయని..
మన చదువును అవి అధిగమిస్తాయని ఊహించాను. ఈరోజు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం. నా గుండె పగిలినంత పనయింది” అని తాప్పీ రాసుకొచ్చారు. విషయం ఏంటంటే.. మిషా అగర్వాల్ ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్. ఏప్రిల్ 24న ఆత్మహత్యకు పాల్పడ్డారు. లా చదువుకున్న ఆమె కెరీర్‌లో ఉన్నతంగా స్థిరపడాలని కలలు కనేది. ఒకానొక దశలో ఇన్‌స్టాగ్రామ్‌పై ఆసక్తి పెంచుకుంది.
రీల్స్, పోస్టులతో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫాలోయింగ్ యావతో తన ఫాలోవర్స్ సంఖ్యను ఒక మిలియన్‌గా మార్చుకోవాలని ప్రయత్నించింది. కానీ, ఫాలోవర్స్ తగ్గుతూ వచ్చారు.
ఆన్‌లైన్‌లో తనను అనుసరించే వారి సంఖ్య తగ్గిందన్న కారణంతోనే మిషా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె కుటుంబసభ్యులు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో మిషా మృతి వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ఉద్దేశించి నటి తాప్పీ పైవిధంగా స్పందించారు.