06-05-2025 12:52:00 AM
నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత రూపొందిస్తున్న తొలి చిత్రం ‘శుభం’. తన సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. “నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ సినిమాను చేశా. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రాలాలా ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రారంభించా. అదే నా లక్ష్యం. మే 9న కుటుంబంతో కలిసి మా సినిమాను చూడండి. థియేటర్ నుంచి ఓ మంచి నవ్వుతో బయటకు వస్తారు” అన్నారు.
“శుభం’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ రాలేదు. ఇలాంటి హారర్, కామెడీ జానర్‌లో చిత్రాలు రావడం అరుదు‘’ అని డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల చెప్పారు. రైటర్ వసంత్ మరింగంటి, హర్షిత్‌రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని, హిమాంక్, ఐకానిక ప్రతినిధి అవినాష్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.