17-09-2025 07:00:27 PM
అయినా ఈరోజు ఏముంది
నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన కార్యాలయ ఉద్యోగి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): జాతీయ జెండా ఎగురవేయాలని అధికారులు ఎవరూ మాకు చెప్పలేదే అయినా బుధవారం ఏముంది అంటూ నల్లగొండ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయ ఉద్యోగి మీడియా సిబ్బందితో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెప్టెంబర్ 17న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలను నిర్వహించింది. దీంట్లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ ఆదేశాలు మాత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఔషధ నియంత్రణ శాఖ ఏడి కార్యాలయం సిబ్బందికి మాత్రం వర్తించలేదు.
తమ కార్యాలయం సందులో ఎవరికీ కనిపించని విధంగా పై అంతస్తులో ఉండడం వల్ల తమ కార్యాలయాన్ని ఎవరూ గమనించలేరు అనుకున్నారో ఏమో కానీ ఏడీ కార్యాలయం సిబ్బంది మాత్రం జాతీయ జెండాను ఎగరవేయలేదు. డ్రగ్ కంట్రోల్ ఏడి కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఎగరవేయలేదన్న సమాచారం మేరకు కార్యాలయానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు కార్యాలయంలో ఏ ఒక్క సిబ్బంది కనిపించలేదు. ఫోన్ ద్వారా మీడియా ప్రతినిధి ఒకరు కార్యాలయ ఉద్యోగికి ఫోన్ చేసి వివరణ అడగగా ఆయన దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా పనిలో పనిగా మీరు పేపర్ లో రాసుకోండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఆయన కార్యాలయ విధులను ఎంత నిబద్ధతతో నిర్వహిస్తున్నాడో అర్థమవుతుంది.
ఈ కార్యాలయంలో పనిచేసే ఈ ఉద్యోగి దీర్ఘకాలికంగా స్థాన చలనం లేకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తూ పై అధికారులను డమ్మీలుగా చేసి కార్యాలయంలో కర్ర పెత్తనం చేస్తున్నట్లు కార్యాలయం పై వివిధ పనుల కోసం వచ్చే మెడికల్ షాప్ ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళ్ళినప్పుడు కార్యాలయంకు వచ్చే వ్యాపారులపై తన నోటి దురుసుతనంతో ఇబ్బందులు పెడుతున్నాడని ఇప్పటికే పలువురు వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేయని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కలెక్టర్ ను కోరుతున్నారు.
పని ఒత్తిడితో జెండాను ఆవిష్కరించలేదు : డ్రగ్ ఇన్స్పెక్టర్ రంజిత్
పని ఒత్తిడి కారణంగా బుధవారం నల్లగొండలోని ఔషధ నియంత్రణ ఏడి కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించలేకపోయామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి రంజిత్ చెప్పారు.