18-11-2025 08:49:54 PM
ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా
మేడిపల్లి (విజయక్రాంతి): ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "నషా ముక్త్ భారత్ అభియాన్” 5వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ... భారతదేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమమని, మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించి, పునరావాస సేవలను అందించడం, మాదకద్రవ్య వ్యసన నివారణ గురించి సమాజానికి అవగాహన కల్పించడం, కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, మద్యం, పొగాకు, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వంటి హానికరమైన పదార్థాల వాడకాన్ని తగ్గించడం, వ్యసనంతో పోరాడుతున్న వారికి మద్దతు అందించడం దీని లక్ష్యం.
మాదకద్రవ్య వ్యసనాన్ని ఎదుర్కోవడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 14446 ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్, సబ్-ఇన్‌స్పెక్టర్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుందా రెడ్డి, సర్కిల్ ఇన్ స్పెక్టర్ జూపల్లి రవి, చైల్డ్ డెవలప్మెంట్ సిబ్బంది, అధికారులు,అరోరా డీమ్డ్ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.