calender_icon.png 20 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో జాతీయ, అంతర్జాతీయ రికార్డులు

20-05-2025 12:34:23 AM

రుద్రాన్ష్ ను అభినందించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, మే 19(విజయక్రాంతి):  అతి చిన్న వయసులో ఆరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి రికార్డులు సాధించిన రుద్రాన్ష్ ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  అభినందించారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ రెడ్డిల కొడుకు రుద్రాన్ష్ రెడ్డి. అతి చిన్న వయసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆరు రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఈ బుడతడి కుటుంబ సభ్యులు సోమవారం  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరును కలిశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రుద్రాన్ష్ రెడ్డిని అభినందించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు విజయాన్ని చేరువవుతారని కలెక్టర్  పేర్కొన్నారు. చదువుతో పాటే చిన్నప్పటి నుంచి కూడా ఆటలపై విద్యార్థులకు అవగాహన  కల్పిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని సూచించారు.

రుద్రాన్ష్ రెడ్డి ఇప్పటివరకు 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్ల దూరం ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికారడ్స్ సొంతం చేసుకున్నాడు. గంట వ్యవధిలో 4.29 కిలోమీటర్లు ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికారడ్స్ సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన 4.29 కిలోమీటర్ల దూరాన్ని ఏకకాలంలో నడిచినందుకుగాను ఏషియన్ బుక్ ఆఫ్ రికారడ్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

అదే సమయం అదే దూరానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికారడ్స్ కూడా రుద్రాన్ష్ ను వరించింది. దాంతో పాటు కళామ్స్ వరల్ రికార్డ్ కూడా ఈ బాలుడు చేజిక్కించుకున్నాడు. ఈ రికార్డులన్నిటికీ ఆ చిన్నారి తాత నరేందర్ రెడ్డి ప్రోత్సాహమందించారు.

ఆ బాలుడిని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నడక ప్రాక్టీస్ చేయించి రికార్డులను కైవసం చేసుకునే విధంగా తర్ఫీదు ఇచ్చారు. చిన్ననాటి నుంచే ఆ పిల్లవాడికి నడకపై ఆసక్తి ఉండడంతో తాత మరింత ఊతం అందించారు. దీంతో ఆరు రికార్డులు సొంతం చేసుకోగలిగాడు. రానున్న రోజుల్లో భారతదేశానికి మంచి క్రీడాకారులను తయారు చేస్తామని కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తెలిపారు.