01-11-2025 12:06:05 AM
నేటిలోగా మరమ్మత్తులు పూర్తి చేస్తాం
కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్
అచ్చంపేట: ఇటీవల కురిసిన వర్షాలతో డిండి సమీపంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి 765 భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అచ్చంపేట, శ్రీశైలం వెళ్లే వాహనాలను కొండారెడ్డిపల్లి, హాజీపూర్, ఉప్పునుంతల మీదుగా దారి మళ్లిస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్లి వాహనాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మరమ్మతు చర్యలను చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సంబంధిత అధికారులను కోరారు. దీంతో శుక్రవారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రహదారిని పరిశీలించారు.
కోతకు గురైన జాతీయ రహదారి పనులను ఇప్పటికే ప్రారంభించామని.. శనివారంలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పోలీసులు, సేఫ్టీ అధికారులతో మాట్లాడిన తర్వాత జాతీయ రహదారిపై తిరిగి వాహన రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు మాత్రమే చేపడుతున్నామని.. నష్ట నివారణ అంచనా వేసి శాశ్వత పనులు చేపడతామని చెప్పారు. శాశ్వత పనులు చేపట్టేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. అంతకుముందు ఆయన కోతకు గురైన రహదారిని పరిశీలించారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉదృతంగా రావడంతోనే రహదారి ధ్వంసం అయినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.