28-07-2025 08:31:25 PM
భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లు నేటితరం గిరిజనులకు తెలిసే విధంగా ఏర్పాటు చేసిన మ్యూజియంను కేంద్ర జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం సోమవారం తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) ఆదేశాల మేరకు ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పరిశీలన చేయడానికి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనుల కుటుంబాలను వారికి అందుతున్న పథకాల గురించి వివరాలు సేకరణలో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను వారు సందర్శించారు.
మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను, పెయింటింగ్ చిత్రాలను క్లుప్తంగా తిలకించారు. మ్యూజియం తిలకించిన అనంతరం నేషనల్ లెవెల్ మానిటరింగ్ బృందం రీసెర్చ్ ఆఫీసర్ ఖాదర్ బాషా, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు నేటితరం గిరిజన యువతి యువకులకు, గిరిజన బాల బాలికలకు, పర్యాటకులకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడం, వాటి యొక్క చరిత్ర ప్రదర్శించడం వలన నేటితరం గిరిజనులె కాక పర్యాటకులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి, సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించడానికి అవకాశం ఉందన్నారు. మ్యూజియంలోని గిరిజనులకు సంబంధించిన పాతకాలపు వస్తువులు, కళాఖండాలు, ఆభరణాలు, పెయింటింగ్ చిత్రాల గురించి స్పష్టమైన సమాచారం సందర్శకులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందని అన్నారు.
అలాగే పాతతరం గిరిజనులు వాడే పనిముట్లు, గిరిజన వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనంతరం గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని సందర్శించి, బిస్కెట్ల తయారీ కొరకు వాడుతున్న ఆహార పదార్థాల గురించి మహిళలను అడిగి తెలుసుకుని, భారతదేశ ప్రధానమంత్రి మిల్లెట్ బిస్కెట్ల ప్రాముఖ్యత గురించి మన్ కీ బాత్ లో ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రసంగించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పేరు లండన్ వరకు పాకిపోయిందని, అందుకు మిల్లెట్ బిస్కెట్ల తయారీకి ఐటీడీఏ పీవో గిరిజన మహిళలకు సహకారం అందించడంతో ఈ మహిళలు మరింత ఉత్సాహంతో మిల్లెట్ బిస్కెట్ల కేంద్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి అవకాశం ఉందని వారు తెలిపారు. అనంతరం దాదాపు 3000 రూపాయల వరకు వివిధ రకాల మిల్లెట్ బిస్కెట్లను వారు కొనుగోలు చేశారు.ఈ కార్యక్రమంలో మ్యూజియం నిర్వహకులు వీరాస్వామి, డిఎస్ఓ ప్రభాకర్ రావు, అపర్ణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.