18-11-2025 05:09:22 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆరవ జాతీయ జల అవార్డులు, జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ 6 అవార్డులు గెలుచుకోగా, జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పంచాయితీరాజ్ కమిషనర్ శ్రీజన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు, నీటిసరఫరా, మురుగునీటి బోర్డు నిర్వహణలో జీహెచ్ఎంసీకి రెండో ర్యాంక్, కేటగిరి-2లో,దక్షిణ జోన్ లోని తొలి 3 స్థానాల్లో వరంగల్ నిర్మల్, జనగామ జిల్లాలు ఉన్నాయి. కేటగిరి-3లో 1,3 ర్యాంకుల్లో భద్రాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలు నిలిచాయి.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... మానవ నాగరికత కథ అనేది నదీ లోయలలో, సముద్ర తీరాల వెంబడి, వివిధ నీటి వనరుల చుట్టూ స్థిరపడిన సమూహాల కథ అని అన్నారు. మన సంప్రదాయంలో నదులు, సరస్సులు, ఇతర నీటి వనరులను గౌరవిస్తాం. మన జాతీయ గీతంలో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన మొదటి పదం సుజలం. దీని అర్థం “సమృద్ధిగా నీటి వనరులతో ఆశీర్వదించబడినది.” ఈ వాస్తవం మన దేశానికి నీటి ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. నీటి సమర్ధవంతమైన వినియోగం ప్రపంచవ్యాప్త అత్యవసరమని రాష్ట్రపతి అన్నారు. మన నీటి వనరులు జనాభాతో పోలిస్తే పరిమితం. తలసరి నీటి లభ్యత ఒక పెద్ద సవాలు.
వాతావరణ మార్పు నీటి చక్రాన్ని ప్రభావితం చేస్తోందని ఆమె చెప్పారు. ఇటువంటి పరిస్థితులలో నీటి భద్రతను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలిసి పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం ప్రారంభించిన జల్ సంచయ్-జన్ భాగీదారీ కార్యక్రమం కింద 35 లక్షలకు పైగా భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలు నిర్మించబడ్డాయని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశాయి. భారతదేశం అంతటా జల వనరుల నిర్వహణలో ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను గుర్తించడంలో 6వ ఎడిషన్ జాతీయ జల అవార్డులు (2024కి) ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తాయి. ఈ అవార్డులను కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ 2025 నవంబర్ 11న న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ప్రకటించారు. అధికారిక అవార్డు ప్రదానోత్సవం ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది.