18-11-2025 05:28:03 PM
కాటారం (మహాదేవపూర్) (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దాంతో 16 మంది గాయాల పాలయ్యారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ చికిత్స నిమిత్తం బారులు తీరారు. మండల కేంద్రంలో ఒక పిచ్చి కుక్క దారి వెంట రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులను అరుస్తూ, గాయపరిచింది. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం గాయాల పాలయ్యారు.
చికిత్స సేవలు అందిస్తున్నాం
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విద్యావతి
మహాదేవపూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడిన సుమారు 16 మందిని మంగళవారం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స సేవలు అందించామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ విద్యావతి తెలిపారు. కుక్క కరిచిన చోటును గుర్తించి ప్రాథమికంగా శుభ్రమైన నీటితో కడగాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కుక్క కాటుకు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని డాక్టర్ విద్యావతి తెలిపారు. తమ వెంట ఆధార్ కార్డును ఆసుపత్రికి తీసుకొని రావాలని సూచించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి డాక్టర్లు నిర్దేశించిన ప్రకారంగా 5 ఇంజక్షన్లను వేసుకోవాలని కోరారు.