calender_icon.png 18 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

18-11-2025 05:44:52 PM

జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, మండల తహసిల్దార్, కాగజ్ నగర్ డివిజనల్ ఇంజనీర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నందున సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు వివరించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ దశలవారీగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాల భవన్ పనులను వేగవంతం చేయాలని, భవనం పిల్లలకు ఉపయోగపడేలా అన్ని వసతులు కల్పించాలని, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను ఆదేశించారు.

మున్సిపల్ ఆస్తుల కొరకు ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థలాల గుర్తింపులో ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు లక్ష్యానికి అనుగుణంగా నిర్ణీత సమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.