18-11-2025 05:46:59 PM
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ జిల్లా పరిపాలన అధికారి ఆదేశాల మేరకు మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న డిసిపియు, సిహెచ్ఎల్, డిహెచ్ఈడబ్ల్యూ, సఖి విభాగాల సమన్వయంతో మంగళవారం కాటారం తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ వెల్ఫేర్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, సఖి టోల్ ఫ్రీ నెంబర్ 181ల గురించి వివరించారు. మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న హత్యలు, నేరాలు వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలుపై భరోసా టీమ్ అవగాహన కల్పించారు.
సాంస్కృతిక కళాకారుల బృందం శిరీష, సుమలత, రాధిక, మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్, నాగమణి, స్వాతి, మధుబాబు, కుమార్ బృందం వారి చేత పాటల రూపంలో చదువు విలువ, మత్తులో యువత పడే బాధలు చక్కగా వివరించారు. డిహెచ్ఈడబ్ల్యు అనూష మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాల వలన జరుగు అనర్థాల గురించి అర్థమయ్యే విధంగా వివరించారు.
అలాగే జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ గుర్రం తిరుపతి మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలు టోల్ ఫ్రీ నెంబర్ 1098 ద్వారా విద్యా, వైద్యం, ఆర్ధికంగా సంబంధించిన అవసరాలు ఎలా పొందాలో వివరించారు. ఎన్జీఓ మెంబర్ శ్రీలత, సఖి మెంబర్ మాధవి 181 టోల్ ఫ్రీ నెంబర్ అవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హెచ్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, నాగమణి, సంపత్, స్వప్న, సంతోష్, గోపాలకృష్ణ, వెంకట్రామిరెడ్డి, రాజు, కోచ్ వెంకటేష్, ఏఎన్ఎం ప్రీతి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.