18-11-2025 05:53:31 PM
హైదరాబాద్: వచ్చే మార్చి నాటికి మావోయిజం అంతమవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం అన్నారు. ఇన్నాళ్లు తుపాకీ చేతపట్టి హిడ్మా ఏం సాధించారు..? అని, ఇవాళ ఎదురుకాల్పుల్లో హిడ్మా దంపతులు చనిపోయారని, అర్బన్ నక్సలైట్ల మాట విని యువత చెడిపోవద్దు అని ఆయన సూచించారు. తుపాకీ చేతపట్టుకుని చర్చలు కావాలంటే కుదరుదని, ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు అంతా క్షేమంగా ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
బుల్లెట్ ను నమ్ముకుని ఏం సాధించలేరని, మాలాగ బ్యాలెట్ ను నమ్ముకోండి అని చెప్పారు. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి పేద పిల్లలు చనిపోతున్నారని, అమాయకులైన గిరిజనులను, పోలీసులను మావోయిస్టులు చంపారని సంజయ్ వాపోయ్యారు. అక్రమంగా తుపాకులు చేతబట్టిన వారిని మోదీ రాజీలేని ప్రభుత్వం క్షమించదని, హోంమంత్రి అమిత్ షా ముందుండి నడిపిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. అమాయకులైన గిరిజన యువకుల చేతికి తుపాకులు ఇచ్చి జీవితాలను పాడుచేశారని, మావోయిస్టులు లొంగిపోయేందుకు 4 నెలలే సమయం ఉందని కేంద్ర మంత్రి హెచ్చరించారు.
ఆయుధాన్ని పక్కనపెట్టి తిరిగి జీవితంలోకి రావాలని, వచ్చే మార్చి నాటికి మావోయిజం అంతమైపోతుందని ఆయన వివరించారు. కొంతమంది నాయకులు నగరాల్లో సురక్షితంగా కూర్చొని, ప్రతి ప్రభుత్వం కింద తమ సంపదను పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఆకలితో అలమటిస్తున్న పేద యువత చేతికి తుపాకులిచ్చి అడవుల్లోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు. అర్బన్ నక్సల్స్‌ను నమ్మడం మానేయండని, అమాయకులు చనిపోవడానికి వారే కారణమని, వారే నిజమైన దేశద్రోహులు అని బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తి చేశారు.