12-09-2025 11:41:56 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్( సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలలో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ మాట్లాడుతూ... హనుమకొండ జిల్లాలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిడిఎస్ పరీక్ష, వడ్డేపల్లి లోని ప్రభుత్వ పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్డీఏ పరీక్ష జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.
14వ తేదీన ఉదయం 10 నుండి 12:30 వరకు ఎన్డీఏ మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుందన్నారు. అదేవిధంగా అదే రోజున సిడిఎస్ పరీక్ష ఉదయం 9 నుండి 11:00 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు జరుగుతుందని, మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4:00 నుండి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. సిడిఎస్ పరీక్ష కు 207 మంది, ఎన్డీఏ పరీక్షకు 410 రాయనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులుకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద, వాటి పరిసరాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాలలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని, విద్యుత్తు శాఖ అధికారులు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.