calender_icon.png 12 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో ఎన్డీఏ హవా!

12-11-2025 01:01:29 AM

ఎగ్జిట్ పోల్స్‌లో మహాఘట్బంధన్‌కు అందనంత దూరంలో..

రెండో విడత పోలింగ్: 68.88%

మొత్తం స్థానాలు: 243

మ్యాజిక్ ఫిగర్: 122

పోల్ ఆఫ్ పోల్స్

ఎన్డీఏ : 147

- ఎంజీబీ : 90


  1. రికార్డు స్థాయిలో 68.88% ఓటింగ్ నమోదు
  2. మొదటి విడతలో 64.66% 
  3. ఓటు హక్కు వినియోగించుకున్న 3.7 కోట్ల మంది
  4. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలం
  5. సర్వేల ప్రకారం ఆ కూటమికి 130 167 సీట్లు
  6. ‘మహాఘట్బంధన్’కు 70 108 స్థానాలు
  7. ప్రశాంత్ కిశోర్ ‘జన్ సూరజ్ పార్టీ’కి 5 సీట్లు లోపే..

పాట్నా, నవంబర్ 11: బీహార్‌లో రెండో విడత (తుది దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతం ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. ఆ సమయం వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా 68.85 శాతం నమోదైంది. ఈ శాతం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం.

ఈనెల 6న జరిగిన మొదటి విడత పోలింగ్‌లో 64.68 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో ఓటింగ్ శాతం పెరగడం విశేషం. రెండో విడతలో మిథిల, కోసి బెల్ట్, పశ్చిమ బిహార్, మగధ్, అంగిక, సీమాంచల్ సహా మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పోలీస్‌శాఖ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

రెండో విడతలో సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోంచుకోవాల్సి ఉండగా, వారి కోసం ఎన్నికల సంఘం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా అక్కడ రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇదేరోజు ఫలితాలు సైతం వెల్లడికానున్నాయి.

ఇక్కడ పోలింగ్ అత్యధికం..

తూర్పు చంపారన్ నియోజకవర్గంలో 69.31 శాతం, పశ్చిమ చంపారన్‌లో 69.02 శాతం, షియోహర్‌లో 67.31 శాతం, సీతామర్హిలో 65.29 శాతం, మధుబనిలో 61.79 శాతం, సుపాల్‌లో 70.69 శాతం, అరారియాలో 67.79 శాతం, కిషన్ గంజ్‌లో 76.26 శాతం, పుర్నియాలో 73.79 శాతం, కతిహార్‌లో 75.23 శాతం, భాగల్ పూర్‌లో 66.03 శాతం, బంకాలో 68.91 పోలింగ్ శాతం నమోదైంది.

ఎన్డీయే కూటమికి అనుకూలంగా.. 

రెండో విడత పోలింగ్ పూర్తయినే వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సర్వే సంస్థలన్నీ బీహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అయిన మహాఘట్బంధన్ కూటమికి తీవ్ర నిరాశ తప్పదని అంచనా వేశాయి. జన సూరజ్ పార్టీకి పెద్దగా ప్రజాదరణ లేదని కూడా ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122. అనేక జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీయే కూటమికి 130  167 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది.

మహాఘట్బంధన్‌కు 70 108 స్థానాలకు పరిమితం కావొచ్చు. అలాగే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పారీ’్ట ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అంచనా వేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొన్న ప్రశాంత్ కిశోర్ తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ‘జన సూరజ్ పార్టీ’ని మాత్రం కింగ్ మేకర్ చేయలేకపోయారని అన్ని సర్వేలు తేల్చాయి.

ఆయా సర్వేల్లో ఆ పార్టీకి 5 సీట్ల లోపే వస్తాయని పేర్కొన్నాయి. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మిథిల, భాగల్ పూర్ వంటి ప్రాంతాల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 65 శాతం మంది మహిళా ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచినట్లు సర్వే వెల్లడించింది. అలాగే 51 శాతం ఓబీసీలు, 49 శాతం ఎస్సీ ఓటర్లు కూడా ఎన్డీయే వైపే మొగ్గు చూపినట్లు పేర్కొంది.