calender_icon.png 23 October, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికవరీ చేయాల్సిందే

22-10-2025 01:21:47 AM

- గైరాన్, భూదాన్ భూముల పేరిట వెలుగులోకి అక్రమాలు 

-23 మంది అక్రమార్కులకు నోటీసులు

-రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రూ.3.84 కోట్ల రికవరీకి చర్యల

- ఫిర్యాదులు 9392017899 నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపాలి

- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం

మహబూబ్ నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో చేసిన భూసేకరణకు సం బంధించిన పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలన్నీ బయటపెట్టి, బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకొనేలా చూస్తా మని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి కొంతమందికి ప్రస్తుతం నోటీసులు వచ్చాయని, వారితో పాటుగా భూములు లేకపోయినా గైరాన్, భూదాన్ భూములపై కూడా పరిహారాలు దిగమింగిన వారందరినీ బయటికి లాగుతామని హెచ్చరించారు.

ఈ అక్రమాలకు సంబంధించిన బాధితులు, ప్రజలు కూడా తమ వద్ద ఉన్న సమాచారం కూడా తనకు అందించాలని కోరారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి గుర్తు చేసారు. ఉదండాపూర్ భూసేకరణ పరిహారాల చెల్లింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అలా జరిగి ఉంటే అందుకు ఆధారాలు చూపాలంటూ అప్పట్లోనే బీఆర్‌ఎస్ నాయకులు చెప్పారని తెలిపారు.

పోలేపల్లి సర్వే నెంబర్ 554 సర్వే నెంబర్ లో భూములు లేకపోయినా ఎకరానికి రూ.12 లక్షలు చొప్పున అక్రమంగా పరిహారాలు పొందారనే విషయంగా రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఈ ఒక్క సర్వే నెంబర్ మీదనే 23 మంది వ్యక్తులు అక్రమంగా రూ.3.84 కోట్ల రుపాయల పరిహారాన్ని దండుకున్నారని గుర్తించారని వెల్లడించారు.

ఈ విషయంగా రెవెన్యూ అధికారిణి పద్మజ నిగ్గు తేల్చిన నిజం ఆధారంగా ప్రస్తుతం 23 మందికి నోటీసులు జారీ చేస్తున్నారని, వారు దిగమింగిన కోట్లాది రుపాయల మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయడానికి చర్యలు చేపట్టారని వివరించారు. తాను అందుబాటులో లేకపోతే తన క్యాంపు కార్యాలయంలో ఉండే పీఆర్వోకు నేరుగా లేదా వాట్సాప్ నెంబర్ 9392017899 ద్వారా గానీ సమాచారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఉదండాపూర్ అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని తాను ప్రభుత్వానికి మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు అనిరుధ్ రెడ్డి వివరించారు.