calender_icon.png 18 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరజ్ నిప్పు కణికలా..

18-09-2025 12:53:33 AM

  1. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయిన స్టార్ జావెలిన్ త్రోయర్
  2. క్వాలిఫయింగ్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే అర్హత
  3. నేడు టోక్యో నేషనల్ స్టేడియంలో ఫైనల్
  4. బుడాపెస్ట్ ఫలితం రిపీట్ అయ్యేనా? 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భారత స్టార్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయ్యేందుకు 84.50 మీటర్ల దూరం మేర జావెలిన్‌ను విసరాల్సి ఉండగా.. నీరజ్ అంతకంటే ఎక్కువ దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు.

మొదటి త్రోలోనే నీరజ్ క్వాలిఫై కావడంతో సెకండ్ త్రో అవసరమే లేకుండా పోయింది. గురువారం జరిగే ఫైనల్ పోరులో కూడా నీరజ్ సత్తా చాటాలని పలువురు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మెన్స్ జావెలిన్ త్రోలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించడం అంత సులభం కాదు. జర్మనీ, చెక్ రిపబ్లిక్, పాకిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్లతో నీరజ్ పోటీ ఉండనుంది.

వీరిలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో ఈటెను విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. వీరు మాత్రమే కాకుండా భారత్‌కు చెందిన మరో ముగ్గురు జావెలిన్ త్రోయర్లు కూడా క్వాలిఫికేషన్ రౌండ్‌లో పోటీ పడుతున్నారు. గురువారం 3.53కి ఫైనల్ పోరు మొదలవనుంది. 

బుడాపెస్ట్ ఫలితం పునరావృతమయ్యేనా!

భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా 2022లో యూజిన్ వేదికగా జరిగిన పోరులో రజతం సాధించాడు. ఆ తర్వాతి సంవత్సరం బుడాపెస్ట్‌లో జరిగిన పోటీల్లో ఎవరూ ఊహించని విధంగా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్ మరోసారి టోక్యోలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.