05-05-2025 02:23:49 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘క్రికెట్ ఖేలో.. నషా చోడో’ అనే నినాదంతో నిర్వహించిన టీ -20 చాంపియన్‌షిప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ‘నో డ్రగ్స్.. నో బెట్టింగ్స్’ అంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి నేతృత్వంలో ఎల్బీ స్టేడియంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఆదివారం వరకు టీ-20 చాంపియన్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.
క్రికెట్ టోర్నీలో విజేతలకు ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి, బెట్టింగ్ యాప్స్ బారిన నేటి యువత పడకుండా సీఎం రేవంత్‌రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
సీఎం స్ఫూర్తితో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువతను మేలుకొలిపే దిశగా ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు చెప్పారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ. 5లక్షల55 వేల555, రెండో బహుమతి కింద రూ.3లక్షల33వేల333లను అందజేసినట్లు చెప్పారు. బెస్ట్ ప్లేయర్‌కు ఎలక్ట్రిక్ స్కూటీ, బెస్ట్ బౌలర్‌కు స్మార్ట్ టీవీ, ఇతర ప్లేయర్స్‌కి కూడా బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.