calender_icon.png 11 May, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదు

11-05-2025 12:15:40 AM

దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై యువ నటి జాన్వీకపూర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సరిహద్దు ఘటనలకు సంబంధించి టీవీఛానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలు సినిమా సన్నివేశాలను తలపిస్తున్నాయని పేర్కొంది.

ఇలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని తాను జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. సరిహద్దుల్లో నెలకొన్న గందరగోళం తనను తీవ్ర కలవరానికి గురిచేసిందని పేర్కొంది. ‘ఇన్నాళ్లూ విదేశాల్లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు శాంతిని కోరుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనదాకా చేరింది.

ఈ ఘర్షణకు దారితీసిన ఆగ్రహం తాలూకు తీవ్రత, బాధ తనకు అర్థమవుతున్నాయి. ఫలితంగా ఇరువైపులా అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లడం నన్ను భయానికి గురిచేస్తోంది. కారణాలు ఏవైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం. ఇది భారతీయ స్వభావానికి విరుద్ధం.

మనం ఎప్పుడూ దురాక్రమణదారులం కాదు. ఇతరుల భూభాగంలోకి చొరబడటం, మనల్ని ఆహ్వానించని వారిపై మన అభిప్రాయాలను రుద్దటం మన సంప్రదాయం కాదు. దశాబ్దాలుగా పిరికి దాడులను ఎదుర్కొన్న భారత్, ఇప్పుడు గట్టిగా తిరిగి కొట్టింది. ఇకపై సహనం వహించేది లేదని స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మన సాయుధ దళాల శక్తి సామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం వారికి ఉంది. మన వైమానిక దళం, నౌకాదళం, సైన్యం తమ ధైర్యసాహసాలతో విజయం సాధిస్తాయి. ఒక్క భారతీయుడికి కూడా హాని జరగకుండా కాపాడతాయి. మన భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న సైనిక దళాలకు నా వందనం’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది జాన్వీ.