31-10-2025 01:44:42 AM
-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
-నవంబర్ 24న బాధ్యతల స్వీకరణ
-14 నెలలపాటు సేవలు
-హర్యానా నుంచి మొట్టమొదటి సీజేఐగా సూర్యకాంత్ రికార్డు
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ వీఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుండగా, ఆ మరుసటి రోజు (24వ తేదీ) ఆయనస్థానంలో జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. అప్పటి నుంచి సుమారు 14 నెలల పాటు ఆయన సీజేఐగా సేవలందించి, 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేయనున్నారు. హర్యానా నుంచి సీజేఐగా ఎంపికైన తొలి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం. అంతేకాదు ఆయన పేరుపై మరో రికార్డు కూడా ఉంది. చండీగఢ్ హైకోర్టు నుంచి అతిచిన్న వయస్సులో ఆయన అడ్వొకేట్ జనరల్ అయ్యారు.
జస్టిస్ సూర్యకాంత్ నేపథ్యం
జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ ప్రాంతంలోని పెత్వార్‌లో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. ఐదుగురు తోబుట్టువులలో ఈయన చిన్నవారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. సూర్యకాంత్ పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. హిసార్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్ పట్టణంలోని మహర్షి దయానంద్ యూని వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ఇదే ఏడాది నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. క్రమంగా చండీగఢ్‌కు మకాం మార్చి, పేరెన్నిక గల పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2000 జూలైలో కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆయన హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఇప్పటికీ ఆ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా సూర్యకాంత్‌పేరుపై రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఆయన కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఫస్ట్‌క్లాస్ గ్రేడ్‌తో ఎల్‌ఎల్‌ఎం కోర్సు పూర్తి చేశారు. 2004 జనవరిలో ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగ, సర్వీసు, సివిల్ చట్టాలలో నైపుణ్యం సాధించి, పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వ సంస్థల తరపున కేసులు వాదించి, ఆయా కేసుల్లో విజయం సాధించారు. 2018 అక్టోబర్‌లో హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆ సమయంలోనే ఆయన ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టం, ఖైదీలకు కూడా గౌరవాభిమానాలు దక్కాలని, వారికి కుటుంబ జీవితం, వైవాహిక హక్కు ఉంటుందని, 2017లో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం హింస కేసులో సిర్సాలోని ‘సచ్చా సౌధా’ ప్రధాన కార్యాలయాన్ని శుభ్రం చేయాలని ఆదేశించడం ఆయన తీర్పుల్లో మైలురాళ్లు. 2019 మే నెలలో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్ల వ్యవధిలో ఆయన 300కు పైగా కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. ఈ క్రమంలోనే ఆయన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గవర్నింగ్ బాడీలో రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ విభాగం ఎగ్జిక్యూటివ్ చైైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ‘వీర్ పరివార్ సహాయత యోజన’కు శ్రీకారం చుట్టారు.