calender_icon.png 31 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆర్జేడీ పాలనలో 35 వేల కిడ్నాప్‌లు

31-10-2025 01:45:51 AM

-నాడు నేరాలకు అడ్డాగా బీహార్

-మళ్లీ అలాంటి భయానక రోజులు రావొద్దు

-రాష్ట్రప్రజలు ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాలి..

-ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పాట్నా, అక్టోబర్ 30: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హయాంలో బీహార్‌లో 35,000 కిడ్నాప్‌లు జరిగాయని, నాడు రాష్ట్రం నేరాలకు అడ్డాగా ఉండేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మళ్లీ అలాంటి భయానక రోజులు రావొద్దంటే ప్రజలు ఎన్డీయే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో గూండాలు వాహనాల షోరూమ్‌లను లూఠీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

నాడు గోలూ కిడ్నాప్, హత్య కేసు యావత్ ఉత్తర బీహార్‌ను కదిలించిందని, ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ అలాంటి కిడ్నాప్‌లు, హత్యలే పునరావృతం అవుతాయదని హెచ్చరించారు. ఆర్జేడీ కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ఆటవిక పాలన (జంగిల్ రాజ్) వస్తుందని దుయ్యబట్టారు. ‘ఆర్జేడీ -కాంగ్రెస్ పాలనను ఐదు ‘క’లతో వర్ణించవచ్చు. ఒకటి కట్టా (నాటు తుపాకీ అరాచకత్వం), రెండు క్రూరత్వం, మూడు కటుత (సామాజిక విద్వేషం), నాలుగు కుశాసన (దుష్టపాలన), ఐదు కరెప్షన్ (అవినీతి). ఆ రెండు పార్టీలు ఎక్కడుంటే అక్కడ ఐదు ‘క’లు రాజ్యమేలుతాయి.

ఆ పార్టీలది నూనె నీటి బంధం. నూనె, నీరు ఎప్పటికీ కలవవు. అలాగే వారి బంధంకూడా’ అని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కేవలం ఓట్ల కోసమే బీహార్‌లో డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. తనను విమర్శించడాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తమ జన్మహక్కులా భావిస్తున్నారని మండిపడ్డారు. యుమనా నది ఒడ్డున తాను ఇటీవల చేసిన ఛఠ్‌పూజ అబద్ధపు పూజ అంటూ రాహుల్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తనపై చేసినవిగా తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు.

రాహుల్ దైవిక కార్యాన్ని అవమానించారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవమానాన్ని బీహార్ తల్లులు ఎన్నటికీ మరచిపోరని, అలాంటి వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి బుద్ధిచెప్పి తీరుతారని అభిప్రాయపడ్డారు. ఛఠ్‌పూజకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీయే కూటమిని గెలిపించాలని, తద్వారా సుపారిపాలన తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.