18-09-2025 01:01:42 AM
పాక్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
ధార్, సెప్టెంబర్ 17: ఇది నవభారతం ఎవరికీ భయపడదని, అణుబెదిరింపులకు తలొగ్గదని ప్రధాని మోదీ తెలిపారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా భైన్‌సోలాలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘దేశంలోని 140 కోట్ల మందికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే పండుగల సీజన్‌తో పాటు ప్రతిసారి స్వదేశీ వస్తువులనే కొనండి. భారత్‌లోని వ్యాపారులు దేశంలో తయారైన వస్తువులనే విక్రయించండి.
దేశాభివృద్ధి కొరకు స్వదేశీ ఉత్పత్తులనే కొనండి. 2047 వరకు భారత్‌ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పాకిస్థాన్, పీవోకేలో ఉన్న ఉగ్రవాద క్యాంపులపై ఎయిర్ స్ట్రుక్స్ చేయడంతో మే ఏడున ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయింది. మన దళాలు కనురెప్ప పాటులో పాక్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాయి. ఇది నవభారతం. ఎటువంటి బెదిరింపులకు భయపడదు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి వారిని మన బలగాలు మట్టుబెట్టాయి.
ఎవరి అణుబెదిరింపులకు నవభారతం భయపడదు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఏడ్వటం ప్రపంచం మొత్తం చూసింది. జైష్-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబాన్ని మే 7న ముక్కలు చేశాం. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిన పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టాం’ అని పేర్కొన్నారు. దేశంలోని మొట్టమొదటి పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
అంతే కాకుండా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మాహ్ ప్రచారాలను కూడా ప్రారంభించారు. పీఎం మిత్ర పథకం కింద ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో పెద్ద ఎత్తున వస్త్ర తయారీ కేంద్రాలను స్థాపించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
నిజాం పాలనలో ఆకృత్యాలకు లెక్కే లేదు
నిజాం పాలిస్తున్న సమయంలో హైదరాబాద్ సంస్థానంలో అనేక ఆకృత్యాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయింది. భారత్‌లో విలీనం చెందడంతో ప్రజలకు నిజాం ఆకృత్యాల నుంచి విముక్తి లభించింది. దీనికి గుర్తుగానే హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 17న మన ఆర్మీ దళాలు హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించాయి. భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటున్నారు. గర్వం, కీర్తి కంటే ఏదీ గొప్పది కాదని హైదరాబాద్ విమోచన దినోత్సవం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.